నాగిరెడ్డిపేట/రాజంపేట్, సెప్టెంబర్14: కరెంట్ షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, రాజంపేట్ మండలాల్లో చోటుచేసుకున్నాయి. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన ముక్కిరి ఎల్లయ్య (41) శనివారం పొలానికి వెళ్లాడు. బోరు చుట్టూ గడ్డి ఏపుగా పెరగడంతో దాన్ని కోస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు కొడవలికి తగలడంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు కృష్ణ (40) శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో చెప్పి పొలానికి వెళ్లాడు. శనివారం ఉదయం వరకు ఇంటికి చేరుకోలేదు. దీంతో భార్య చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువులు పొలానికి వెళ్లి చూడగా, కృష్ణ మోటర్ స్టార్టర్ డబ్బా వద్ద కరెంట్ తీగలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. పొలానికి వెళ్తుండగా, కాలు జారి తీగలపై పడటంతో కరెంట్ షాక్కు గురై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కృష్ణ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.