ఐనవోలు/రామారెడ్డి(సదాశివనగర్), మార్చి 18 : పొలాల్లో విద్యుత్తు తీగలు తెగి పడటంతో ఇద్దరు రైతులు కరెంట్ షాక్‌తో మరణించారు. ఈ ఘటనలు హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ గౌడ్ (45) కులవృత్తితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న ఎకరంన్నర భూమిలో వరి సాగుచేయగా, బోరు బావిలో నీళ్లు అడుగంటుతున్న క్రమంలో ఉదయమే నీళ్లు పారించేందుకు వెళ్లాడు. మోటర్ పని చేయకపోవడంతో బోరు వద్ద అటు, ఇటు తిరిగే క్రమంలో విద్యుత్తు తీగ తగలడంతో షాక్‌కు గురై పక్కనే ఉన్న ఒర్రెలో పడి అక్కడికక్కడే మృతి చెందా డు. మరోవైపు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన గుడిసె సతీశ్ (25) మంగళవారం పొలంలో పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. పురుగు మందులో నీళ్లు కలపడానికి పొలం పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దిగాడు. అప్పటికే విద్యుత్తు తీగ తెగిపో యి ఆ బావిలో పడి ఉండటంతో సతీశ్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.
జగిత్యాల రూరల్/వెంకటాపురం(నూగూరు), మార్చి 18 : సాగు కలిసి రాక, అప్పులు మీదపడి మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జగిత్యాల, ములుగు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతులాపురం రాజం (55) తనకున్న 25 గుంటలతోపాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గతంలో ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి తిరిగి రావడం, సాగు పెట్టుబడికి అప్పులు చేయడం, దిగుబడులకు సరైన ధర రాకపోవడం, కౌలు భరోసా అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.సుమారు రూ.15 లక్షల వరకు అప్పు కాగా, మనోవేదనతో మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజం కుటుంబ సభ్యులను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరామర్శించి, ధైర్యం చెప్పారు. అసమర్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు రైతు భరోసా ఇవ్వక, ఇటు రుణమాఫీ చేయక, సాగునీరు అందించకపోవడంతో పంట దిగుబడి లేక అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధి బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు రామెల్ల సతీశ్(39) మూడు ఎకరాల్లో మిర్చి తోటను సాగు చేశాడు. పంట చేతికొచ్చినా కూలీలు దొరక్క కాయలు నేలరాలి నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సతీశ్ 15 రోజులుగా మద్యానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మిర్చితోట వద్దకు వెళ్లి మద్యం మత్తులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.