ముస్తాబాద్/ వర్ధన్నపేట, ఫిబ్రవరి 27: విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన రైతు బల్గూరి వెంకటేశ్వర్లు(51) వరి పంటను సాగు చేస్తున్నాడు. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్కు ఆన్ ఆఫ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో మోటర్లు సరిగా నడవకపోవడంతో వరి పొలం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది.
ఈ విషయమై పలుమార్లు విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయింది. గురువారం పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన వెంకటేశ్వర్లు స్టార్టర్ వద్ద ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తుండగా విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పక్క పొలాల రైతులు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
మరో ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన రైతు ఆరె లక్ష్మీనర్సు(54) వారం రోజుల క్రితం పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వేస్తుండగా ప్రమాదవాశాత్తు విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆయనను సిద్దిపేట దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదారాబాద్‌లో దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గురువారం నామాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య భూలక్ష్మి, కొడుకు నవీన్, కూతరు మౌనిక ఉన్నారు.