మొయినాబాద్/నర్సింహులపేట, నవంబర్ 20 : అప్పుల బాధ భరించలేక రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన బల్వం సిద్ధాంతిగౌడ్ (48) వ్యవసాయం చేయడంతోపాటు ప్రైవేటు ఉద్యోగం కూడా చేసేవాడు. వచ్చిన జీతంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం చేయడానికి అప్పులు చేసి పెట్టుబడి పెట్టడంతో నష్టం వచ్చింది. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడు. పెద్దలు మందలించడంతో కొన్ని రోజులు బాగానే ఉన్నా అప్పులు అతన్ని వెంటాడుతునే ఉన్నాయి. చేసిన అప్పులు తీర్చడానికి మార్గం లేకపోవడంతో బుధవారం ఉదయం పొలంలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోల్ బోడ్కతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోల్తండాకు చెందిన రైతు లూనావత్ సురేశ్ (20)కు ఎకరం 10 గుంటల పొలం ఉన్నది. ఎకరంలో మిర్చి, 10 గుంటల్లో వరి సాగు చేశాడు. మిరప పంటకు పురుగు మందులు తదితర సాగు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో భార్య పుస్తెలతాడు కుదువ పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. పంట పెట్టుబడికి డబ్బులేక, కు టుంబ కలహాలతో మనస్తాపం చెందిన సురేశ్ ఈ నెల 14న పురుగుల మందు తాగడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.