ఎర్రుపాలెం/చిట్యాల, మార్చి 14: దిగుబడులు లేక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటనలు ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు (37) తనకున్న రెండున్నర ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశాడు. పంట సాగుతోపాటు కుటుంబ అవసరాల కోసం సుమా రు రూ.21 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడా ది మిర్చి పంటకు కూడా సరైన ధర లేకపోవడంతో ఈ మొత్తం అప్పులను తీర్చే మా ర్గం కానరాక మానసికంగా కుంగిపోయాడు.
ఈ క్రమంలో ఈ నెల 7న ఉదయం పొలం వద్ద గడ్డిమందు తాగి ఇంటికి వచ్చాడు. మం చంపై పడుకొని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమతలేక మరుసటి రోజు ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పీ వెంకటేశ్ తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సూర కుమారస్వామి(44) ఆరేండ్ల క్రితం సమీపంలోని గుంటూరుపల్లికి వలస వెళ్లాడు. అక్కడ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడంతో పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పు, నిరుడు కూతురి వివాహం కోసం చేసిన అప్పు కలిపి మొత్తం రూ.12 లక్షలు అయ్యింది. సాగు కలిసిరాకపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో గత నెల 19న కౌలుకు తీసుకున్న చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ కుమారస్వామి శుక్రవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.