ఆదిలాబాద్, ధర్మారం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు ఆత్మహత్యలు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బజూర్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన రైతు మయిల నర్సయ్య (55) తన వ్యవసాయ భూమిలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకున్న ఆరు ఎకరాల్లో వానాకాలం పత్తి, కంది పంటలు వేశాడు. రైతు భరోసా రాకపోవడంతో పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. రూ.3 లక్షల వరకు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంకులో రూ.2.20 లక్షల అప్పు కూడా ఉన్నది. ఈ పంట రుణం మాఫీ కాలేదు. మొత్తం అప్పులు కలిపి రూ.5.20 లక్షలకు చేరుకున్నాయి. పంట దిగుబడి వస్తే అప్పులు తీర్చుదామని అనుకున్నాడు. కానీ దిగుబడి సరిగా రాలేదు. ఓ వైపు నెత్తిన అప్పుల కుప్ప ఉండటం, మరోవైపు రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన రైతు సుతారి రామన్న (56) తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తన పొలం వద్దకు వెళ్లిన ఆయన అక్కడే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రామన్న ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎస్ఐ తెలిపారు.