రఘునాథపాలెం/ ఉట్నూర్ రూరల్, జూన్ 3: అప్పుల బాధ తాళలేక ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శంభుగూడకు చెందిన రైతు సెడ్మకి పులాజీరాం(45) తనకున్న రెండెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. పెట్టుబడి కోసం రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు. దీనికితోడు మూడు నెలల క్రితం తన తమ్ముడు సెడ్మకి బాదిరావు ఆత్మహత్య చేసుకోగా.. అతడు చేసిన అప్పులు రూ.2లక్షలు ఉం ది. దీంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగతో సోమవారం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందుతాగాడు.
వెంటనే కుటుంబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడికి చెందిన పరిమిశెట్టి వీరబాబు (55) వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
తనకున్న మూడెకరాలకు తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగుచేశాడు. పంట పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. ఈక్రమంలో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన వీరబాబు సోమవారం రాత్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.