తలమడుగు/వెంకటాపురం(నూగూరు), మార్చి 21: అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న దిగుబడులు రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపంతో ములుగు జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి తనువు చాలించాడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మండలం సుంకిడికి చెందిన రైతు కుమ్మరి లింగన్న (48)కు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.3 లక్షలు అప్పులు చేశాడు. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా అందక చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ అంజమ్మ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం బర్లగూడెం జీపీ చిరుతపల్లి గ్రామంలో రైతు లుక మధుకృష్ణ (29) రెండెకరాల్లో బాండ్ మక్కజొన్న పంటను సాగుచేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతదేహంతో రహదారిపై ధర్నా
నకిలీ మొక్కజొన్న విత్తనాల కారణంగా పంట నష్టపోయి అప్పులబాధతో మధుకృష్ణ ఆత్మహత్యకు పాల్పడాడ్డని కుటుంబ సభ్యులు మృతదేహంతో చిరుతపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్థులు, గిరిజన సంఘాలు, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు.