నార్కట్‌పల్లి/మంగపేట, నవంబర్ 15: అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు నల్లగొండ, ములు గు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. నల్లగొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంల గ్రామానికి చెందిన రైతు మందడి సుఖేందర్‌రెడ్డి (40) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నార్కట్‌పల్లికి వచ్చాడు. పుల్లెంలలో తనకు ఉన్న ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. కానీ ఇటీవలి వర్షాలతో పంట మొత్తం నష్టపోయింది.
రెండేళ్లుగా పత్తి పంట సాగు కోసం తెచ్చిన సుమారు రూ.6 లక్షల అప్పు మీదపడటంతో మానసికంగా కుంగిపోయాడు. వాటిని తీర్చే మార్గం లేక గురువారం మధ్యాహ్నం నార్కట్‌పల్లిలోని ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే నల్లగొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. సుఖేందర్ రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాయిగూడేనికి చెందిన రైతు సుంచ ఆదినారాయణ(38) తనకున్న రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయంతో పాటు ఇంటి అవసరాలకు సుమారు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్దే గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించేలోపే మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య వెంకటరమణ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేశ్ తెలిపారు.