KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పోటెత్తారు. అభిమాన నేతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ‘బాపు’ కడుపు సల్లగుండాలని కోటి దీవెనలు అందించారు. మహా స్వాప్నికుడి ఆత్మీయ స్పర్శ కోసం జనం గుంపులు గుంపులుగా బారులు తీరారు. వారికోసం ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు గంటలపాటు కేసీఆర్ నిలబడే ప్రజలకు అభివాదం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జనం మధ్యలోకి వచ్చిన కేసీఆర్.. సాయంత్రం వరకు వారితోనే గడిపారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉప నేత హరీశ్ రావు ఆయన వెంట ఉన్నారు. మధ్యలో హరీశ్‌రావు కుర్చీ ఏర్పాటుచేసినా కేసీఆర్ కూర్చోవటానికి ఆసక్తి చూపలేదు.
మంగళవారం ఉదయం భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు, అభిమానులు, సామాన్యులు, యువకులు, మహిళలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫాంహౌస్‌కు తరలివచ్చారు. అక్కడే ఎవరికి వారుగా కేసీఆర్‌కు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అంచనాకు మించి అభిమానులు తరలిరావటంతో వ్యవసాయ క్షేత్రం వద్ద రద్దీ పెరిగింది. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో ఎర్రవల్లి పరిసర ప్రాంతాలు మార్మోగాయి. భారీ ఎత్తున అభిమానులు తరలిరావటంతో కేసీఆర్ బయటికి వచ్చారు. ప్రతి ఒక్కరినీ పలుకరించి, వారితో ఫొటో దిగారు. ఎవరినీ నిరాశపరచకుండా సాయంత్రం వరకు పార్టీ క్యాడర్, అభిమానులతో కేసీఆర్ ఉత్సాహంగా గడిపారు.
ఎర్రవెల్లికి వచ్చిన అభిమానుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి జోష్ నింపారు. ‘జై కేసీఆర్.. జై తెలంగాణ.. సీఎం కేసీఆర్’ అంటూ నినదిస్తూ కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేరుగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, ముఖ్య నేతలు ఉన్నారు. కేసీఆర్ పుట్టినరోజును పురసరించుకొని గాయని గంగ పాడిన పాటల సీడీని కేసీఆర్ ఆవిషరించారు. మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవెల్లిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కేసీఆర్ కప్పు బహూకరించారు.

బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ సేవా, సామాజిక కార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. మహేశ్ బిగాల ప్రత్యక్షంగా ఎన్నారైల తరఫున కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల ఎన్నారైలు నిర్వహించిన కార్యక్రమాల వీడియోను హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మహేశ్ బిగాల, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు ఉన్నారు. బీఆర్ఎస్ యూఎస్ఏ చైర్మన్ మహేశ్ తన్నీరు రూపొందించిన ‘రావయ్యా ఓ సారు.. కేసీఆరు’ అనే పాటను మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ డెన్మార్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమన్వయకర్త సుధీర్ బిందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అక్సాన్‌పల్లి, తాడ్మనూర్లకు చెందిన భూపాల్‌గౌడ్, లక్ష్మణ్, రఘు, రణధీర్‌రెడ్డి, హరీశ్, నరేశ్ ఉత్తరాఖండ్‌లోని చంద్రశీలా శిఖరంపై వేడుకలు నిర్వహించి ఉద్యమ నాయకుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలోనూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి నారాలోకేశ్, తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, చిరంజీవి, విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, పార్టీ శ్రేణులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుడు మహేశ్‌కు రూ.72వేల ఆర్థికసాయాన్ని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అందజేశారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని త్వరలో అందజేస్తానని ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. కుకునూర్‌పల్లి మండలం లకుడారంలో నిరుపేద కుటుంబాలకు మెర్సు కరుణాకర్‌రెడ్డి.. అవుసుల లక్ష్మికి రూ.20వేలు, పైసా లక్ష్మికి రూ.20వేలు, రాచకొండ శంకరయ్యకు రూ.20వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. మర్కూక్‌లో నవనీత, ఎంబర్తి మంజుల, గడ్డమీది రేణుక కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఆర్థికసాయాన్ని మర్కూక్ కరుణాకర్‌రెడ్డి అందజేశారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, యువనేత తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు 72 కేజీల భారీ కేక్‌ను కేటీఆర్ కట్ చేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్‌లివ్ కేసీఆర్.. నినాదాలతో భవన్ పరిసరాలు మారుమోగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలోని నాటి ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, మలిదశ ఉద్యమ ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ, పాటలను ప్రదర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావు చేతుల మీదుగా పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఒక దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ సైకిల్‌తోపాటు జీవనోపాధి కోసం రూ.లక్ష చెక్‌ను బీఆర్ఎస్ బేగంపేట డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు రాగ నాగరాజుగౌడ్ అందజేశారు.

కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి నివాసానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు