తాడూరు/చిలిపిచెడ్, ఫిబ్రవరి 11 : సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందిన రైతు సంగిశెట్టి చిన్నయ్య (40) తనకున్న నాలుగున్నర ఎకరాలతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తర్వాత దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. రెండు ఎకరాలు అమ్మి రూ.34 లక్షలతో కొన్ని అప్పులు తీర్చాడు. ఇంకా అప్పులు మిగిలి ఉండగా.. ఉన్న రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తున్నాడు. ఈ వానకాలంలోనూ పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు.
చేసేది లేక మరో అర ఎకరాను రూ.3.50 లక్షలకు కుదువ పెట్టాడు. భూ బదలాయింపు జరిగి ఫిబ్రవరితో 11 నెలలు కాగా.. మరో నెల గడువు మాత్రమే ఉండటంతో బ్రోకర్ వచ్చి రైతు చిన్నయ్యను సంప్రదించాడు. నెల రోజుల గడువు మాత్రమే ఉన్నదని సోమవారం మరోసారి రైతు వద్దకు వెళ్లి హెచ్చరించాడు. తాడూరుకు చెందిన గ్రామపెద్ద ఇంకా సమయం ఉన్నది.. అప్పటి వరకు డబ్బులు చెల్లిస్తాడు అని బ్రోకర్‌ను సర్దిచెప్పి పంపించాడు. కాగా రైతు భరోసా సాయం అందకపోవడం.. పంటలు సాగు చేస్తే పెట్టుబడులు మీదపడటం.. దిగుబడి రాక.. రూ.15 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
చండూరులో రైతు రమేశ్..
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూరు గ్రామానికి చెందిన రైతు బుడ్డనొల్ల రమేశ్ (38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగు కలిసిరాలేదు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయానికి సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఈ నెల 10న మధ్యాహ్నం మంజీరానదిలో దూకి చనిపోతున్నట్టు భార్యకు ఫోన్‌చేసి చెప్పి నీటిలో దూకాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి మంజీరానది వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో వెతకగా రమేశ్ మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై మిస్బావొద్దీన్ తెలిపారు.