చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మరణించారు. శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సతీష్ కుమార్ (55) తేజ (24) లుగా గుర్తించారు. వారి మృతదేహాలను చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.