Telangana | నారాయణఖేడ్, అక్టోబర్ 13 : ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా మరో 120 మందికి పైగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా విషాదం నింపింది. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోగా, జంతు కళేబరాలు పడేసిన బావి నుంచి సరఫరా చేసిన నీటిని తాగడంతో పండుగ పూట పదుల సంఖ్యలో గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రమంతటా కలకలం సృష్టించింది. ఐదు రోజుల నుంచి మోటర్లు పని చేయడం లేదన్న కారణంతో గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా గ్రామంలోని ఓ బావి నీటిని బీసీ కాలనీలోని ట్యాంకు ద్వారా సరఫరా చేశారు.
ఈ నీటిని తాగిన ప్రజలు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించి, సకాలంలో వైద్యం అందక ఈ నెల 10న మహేశ్(28), 11న సాయమ్మ (87) ఒక్కరోజు వ్యవధిలోనే చనిపోయారు. అస్వస్థతకు గురైనవారిని నారాయణఖేడ్, సంగారెడ్డి సర్కార్ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరికి ఆరోగ్య ఉప కేంద్రం లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. నీటిని సరఫరా చేసిన బావిలో కుక్కలు ఇతర జంతువుల కళేబరాలు ఉండడం మూలంగానే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు చెప్తున్నారు. బావి దుస్థితిని అంచనా వేయకుండానే ప్రత్యేకాధికారి నాగలక్ష్మి అందులోంచి నీటిని సరఫరా చేయించడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో 10 బోరు మోటర్లు ఉన్నా కేవలం రెండు మాత్రమే పని చేస్తున్నాయని ఈ పరిస్థితుల్లోనే బావిలోంచి నీటిని సరఫరా చేశారనే విమర్శలున్నాయి.
సంజీవన్రావుపేట్ను ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి శనివారం సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంతపెద్ద ఎత్తున గ్రామస్తులు అస్వస్థతకు గురవడానికి బావినీరే కారణమని తెలుసుకొని పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఆదివారం గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన డీఎంహెచ్వో గాయత్రీదేవి, డీపీవో సాయిబాబాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించినందునే ఈ సమస్య తలెత్తిందని నిలదీశారు. గ్రామంలో 10 బోరు మోటర్లు ఉన్నాయని, వాటిని ఎందుకు పునరుద్ధరించలేదని మండిపడ్డారు. పై అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోతే కలుషిత ఆహారం తిని అస్వస్థతకు లోనైనట్టు చెప్పడమేమిటని మండిపడ్డారు. దీంతో వారు స్పందిస్తూ కలుషిత నీరు తాగడం వల్లే ఈ సమస్య వచ్చిందనే విషయం తమ విచారణలో తేలిందని చెప్పారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేటలో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్కావడంతో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందటం, 120 మందికిపైగా అస్వస్థతకు గురవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ సర్కారు దేనని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇంటింటికీ సరఫరా అయిన మిషన్ భగీరథ నీటిని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ‘తెలంగాణ అంతటా తాగునీటి సరఫరా కోసం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తిచేసింది. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి ప్రజలందరికీ తాగునీరిచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ సర్కారు సరిగ్గా నిర్వహించలేకపోతున్నది’ అని విమర్శించారు. సంజీవన్రావుపేట ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సాయం అందించాలని, రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.