సూర్యాపేట: సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి ముందున్న మరో బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న క్లీనర్ ఎగిరి బయటపడ్డాడని, అతనిపై నుంచి బస్సు వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడని చెప్పారు. కాగా, అతివేగం, దట్టంగా అలముకున్న పొగమంచుతో ముందు వాహనాలు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.