Rain Alert | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతోపాటు, ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో అత్యధికంగా 8.8 సెం.మీ నమోదైన్నట్టు వివరించింది. శుక్రవారం 19జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.