సిర్పూర్(టీ)/రెబ్బెన, నవంబర్ 16 : వర్షాలకు పంటలు దెబ్బతినడం.. అప్పులు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వేంపల్లి, రెబ్బెన మండలం గంగాపూర్‌లో చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. సిర్పూర్(టీ) మండలం వేంపల్లికి చెందిన మొర్లె రాము (41) తనకు ఉన్న ఎకరం భూమితోపాటు నాలుగు ఎకరాలు పోడు భూమిలో పత్తి సాగుచేశాడు. ఇందుకు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టం వాటిల్లింది. మరో వైపు సుమారు రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 13న తన పొలంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు, కుటుంబసభ్యులు గుర్తించి వెంటనే కాగజ్‌నగర్‌లోని దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రాముకు భార్య గంగుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రైతు రాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
గంగాపూర్‌లో పత్తి రైతు..
రెబ్బెన మండలం గంగాపూర్‌కు చెందిన ముంజం సంతోష్ (30) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ ఏడాది తన సోదరుడు తిరుపతితో కలిసి సంతోష్ 10 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. అధిక వర్షాల కారణంగా పత్తి పంట చాలా వరకు దెబ్బతినగా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి పెరట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన అన్న శ్యాంరావు తన బైక్‌పై రెబ్బెన ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై
వెంకటకృష్ణ తెలిపారు.