స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజావ్యతిరేకత వెంటాడుతున్నది. ఓట్లు అడిగేందుకు వెళ్లిన ప్రతిచోటా చుక్కెదురవుతున్నది. హామీలు, సమస్యల పరిష్కారంపై నిలదీసి అడ్డుకోవడంతో.. సదరు ఎమ్మెల్యేలు ఆక్రోశంతో దురుసుగా మాట్లాడుతున్నరు. ‘మీకు సాయం చేసేందుకు జిల్లా పెంబిలో ప్రచారానికి వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఊగిపోతూ పచ్చిబూతులు మాట్లాడాడు. ఇక ‘వానకాలం వడ్లు కొంటలేరని.. యూరియా అందక ఆగమైతున్నమని’ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును వరంగల్ జిల్లా రాంధాన్తండా రైతులు, మహిళలు అడ్డుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఆయన షాక్‌కు గురయ్యారు.
నిర్మల్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ)/వర్ధన్నపేట : హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన ప్రజలపైనే అధికార పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీచేస్తున్న మల్లపెల్లి సత్యనారాయణస్వామి తరఫున ప్రచారం చేసేందుకు శనివారం ఎమ్మెల్యే బొజ్జు ఎస్సీకాలనీకి వెళ్లారు. ఓట్లు అడుగుతున్న సమయంలో పలువురు ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. ‘రెండేండ్ల పాలనలో మాకు ఏం మేలు చేశారు? రుణమాఫీ, రైతు భరోసా పేరిట మోసం చేశారు’ అంటూ పలువురు యువకులు, మహిళలు నిలదీశారు. కేవలం ఓట్ల సమయంలోనే వచ్చావని, ఇప్పటివరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
పింఛన్లు కూడా సక్కగ ఇస్తలేరని మహిళలు నిలదీయంతో ఎమ్మెల్యే బొజ్జు వారితో వాగ్వాదానికి దిగారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్లకు ఏమన్నా ఇచ్చిందా? అని ఎమ్మెల్యే అడుగగా అవును ‘టైంకు రైతుబంధు ఇచ్చిన్రు.. మీరు ఇచ్చిన్రా?’ అంటూ స్థానికులు ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కొందరికే అయిందని వాపోయారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. ‘మీకు సహాయం చేసేందుకు నాకేమైనా తీటనా, నాకు క్రాస్ క్వశ్చన్లు వేయొద్దు’ అంటూ నోటిదురుసు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాటలకు వెంట ఉన్న మద్దతుదారులు సైతం కంగుతిన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాలనీవాసులు నిరసన తెలుపడంతో పరిస్థితి చేయిదాటుతున్నట్టు గమనించిన ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయన్ను సముదాయించే ప్రయత్నంచేశారు. ప్రజలంతా కోపోద్రిక్తులవుతున్నట్టు గ్రహించి అక్కడినుంచి వెనుదిరిగారు. ఎమ్మెల్యే తమ సమస్యలను వినకుండా అసభ్య పదజాలంతో దూషించడమేమిటంటూ ప్రజలు బహిరంగంగానే నిరసన వ్యక్తంచేశారు. కాగా ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు స్థానికులు తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఇప్పుడెందుకు వచ్చారు?: వర్ధన్నపేటఎమ్మెల్యే నాగరాజుపై గిరిజనుల ఆగ్రహం
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చుక్కెదురైంది. శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధాన్తండాకు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసేందుకు వెళ్లగా తండావాసులు అడ్డుకున్నారు. వానకాలం వడ్లు కొనుగోలు చేయాలని, మీతో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలం సాగుకు యూరియా కోసం ఎన్నో ఇబ్బందులు పడినా అధికారులు, మీరు ఏమాత్రం సహకరించలేదని వాగ్వాదానికి దిగారు. తండాకు చెందిన ఓ యువకుడి కుటుంబానికి సమస్య వచ్చిందని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని యువకులు, మహిళలు ఎమ్మెల్యే నాగరాజును నిలదీశారు. కష్టం వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకొచ్చారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ప్రజల తిరుగుబాటుతో తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నదని గ్రహించిన ఎస్సై సాయిబాబు, పోలీసులు గిరిజన యువకులు, మహిళలను అడ్డుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.