రాంనగర్(కరీంనగర్), ఫిబ్రవరి 7: కాంగ్రెస్ సర్కారు మహిళల కోసం తెచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం అతడికి శాపమైంది. ఉపాధి దూరమై, తెచ్చిన అప్పులు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఓ ఆటోడ్రైవర్ ఉసురు తీసుకున్నాడు. కిస్తీలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక పురుగులమందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లికి చెందిన బుర్ర కరుణాకర్ (44) కొన్నేండ్ల కిందట కరీంనగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. రాంనగర్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ప్రభుత్వం రెండు నెలల కిందట మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కరుణాకర్ ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. తెచ్చిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మధ్యాహ్నం నగర శివారులోని మార్క్‌ఫెడ్ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఆ వెంటనే భార్య పావనికి ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగినట్టు చెప్పాడు. ఆమె రాంనగర్ ఆటో స్టాండ్‌కు వచ్చి ఆటోడ్రైవర్లకు జరిగిన విషయం తెలిపింది. తోటి ఆటో డ్రైవర్లతో కలిసి అకడికి వెళ్లి చూడగా కరుణాకర్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కరీంనగర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. విగతజీవిగా కనిపించిన భర్తను చూసి భార్య బోరున విలపించింది. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకుని రోదించింది. భార్య పావని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సీఐ వెంకటేశ్ తెలిపారు.