రెంజల్/నవీపేట, అక్టోబర్ 14 : ఉపాధి లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరుగా జరిగినప్పటికీ ఇద్దరు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన మీసారె లక్ష్మణ్ (26)కు భార్య, ఇద్దరు పిల్లలు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మణ్‌కు కొన్నాళ్లుగా కష్టాలు మొదలయ్యాయి. ‘మహాలక్ష్మి’ పథకం కారణంగా ఆటో సరిగా నడవడం లేదు. మరోవైపు, ఆర్నెళ్ల క్రితం భార్య మృతి చెందింది. దీంతో లక్ష్మణ్ ఇద్దరు పిల్లలతో కలిసి రెంజల్ మండలం సాటాపూర్‌లో నివాసముండే బావ గంగాధర్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆటో నడువక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, భార్య దూరం కావడంతో జీవితంపై విరక్తి చెందిన లక్ష్మణ్ ఈనెల 12న దసరా రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కందకుర్తి సమీపంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మణ్ జాడ లేకపోవడంతో అతని బావ గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈక్రమంలో గోదావరి వద్ద వంతెనపై బైక్, చెప్పులు లభించాయి. గజఈతగాళ్లను రంగంలోకి దింపి గాలించగా, సోమవారం లక్ష్మణ్ మృతదేహం లభ్యమైంది. నవీపేట మండలం అనంతగిరికి చెందిన జీవన్‌రెడ్డి(57)కి భార్య లావణ్య, కూతురు శోభిత, కుమారుడు సంతోష్‌రెడ్డి ఉన్నారు. బతుకు దెరువు కోసం పదేండ్ల క్రితం నిజామాబాద్‌కు వెళ్లిన జీవన్‌రెడ్డి.. ఫైనాన్స్‌లో ఆటో కొని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నాలుగేళ్ల క్రితం అప్పు చేసి కూతురి పెండ్లి జరిపించాడు. కొద్ది రోజులుగా ఆటో నడవక ఆదాయం తగ్గింది. ఫైనాన్స్ వ్యాపారులు, కూతురి పెండ్లికి చేసిన అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన.. వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.