హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ సర్కార్‌పై జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వరింగ్ జ ర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమి టీ ఇచ్చిన ‘చలో హైదరాబాద్’ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.
అనంతరం ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే భారీ ర్యాలీగా సచివాలయ ముట్టడికి బయల్దేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పంజాగుట్ట, ఆసిఫ్‌నగర్, తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామని ప్రతీ సందర్భంలో హామీలు ఇవ్వడమే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూ రు చేయాలని డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్‌తో పాటు హెల్త్‌కార్డులు అందించి కార్పొరేట్ దవాఖానల్లో ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి జర్నలిసుకూ ఉచిత బీమా పథకం ఏర్పాటు చేయాలని, 60ఏండ్లు దాటిన వారికి పెన్షన్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, చిన్న, మధ్యతరహా పత్రికలకు పెండింగ్‌లో ఉన్న అడ్వైర్టెజ్‌మెంట్ బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్‌కుమార్,యాదగిరి, తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్, దామెర జగదీశ్వర్ గుప్తా, కే పాండురంగారావు, పద్మనాభరావు, సామ్రాట్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వీ రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్ శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌కుమార్, ఎం రవికుమార్, సుభాష్, రేగటి వెంకన్నతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.