Fire Accident | సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్‌లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. షార్ట్క్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు నిన్న వార్తలు వచ్చాయి. అయితే, వాటిని విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో కరెంటు సరఫరా ఉందని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగే ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని, కానీ నిన్న అలా జరుగలేదన్నారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందడంతో వెంటనే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వివరించారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు.
అగ్ని ప్రమాదం ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్‌ను పరిశీలిస్తున్నారు. పొగ దట్టంగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలకు వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్‌లో ఐరన్ ర్యాక్‌లు ఏర్పాటు చేసి టాన్‌ల కొద్దీ బట్టలను నిల్వచేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో భవనం పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీం, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ భవనాన్ని పరిశీలించిన అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. మంటలు వ్యాపించిన భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాల పటిష్టతను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్టోర్స్‌లో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో మంటలు రాగానే 17 మంది భవనం నుంచి బయటకు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామగ్రి తెచ్చేందుకు వెళ్లి ముగ్గురు లోపల చిక్కుకుపోయారని పేర్కొన్నారు. అయితే, చిక్కుకుపోయిన కార్మికులు గుజరాత్‌కు చెందిన కార్మికులు జునైద్ (25), జహీర్ (22), వసీం (32)గా తెలిపారు. అయితే, భవనంలో చిక్కుకుపోయిన ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. ప్రమాదం తర్వాత ముగ్గురు ఆచూకీ కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో భవనంలోనే చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, కనిపించకుండా పోయిన ముగ్గురిలో ఒకరి మృతదేహం రెండో ఫ్లోర్లో అధికారులకు కనిపించినట్లుగా సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. డెక్కన్ స్టోర్ భవనం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.