హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): వైద్య సిబ్బందియందు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) సిబ్బంది వేరయా.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. టీవీవీపీ ఉద్యోగులు ఇప్పటికీ సొసైటీ కిందే ఉన్నారు. దీంతో సమయానికి వేతనాలు అందక, పదవీ విరమణ ప్రయోజనాలు అందక బ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీ నే జీతాలు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. టీవీవీపీ ఉద్యోగులకు మాత్రం దక్కని పరిస్థితి.
ఈ నెలలో శనివారం నాటికీ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. సోమవారం (12న) వారి ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెప్తున్నా రు. ప్రతి నెల మిగతా వైద్యసిబ్బందికన్నా వారం పదిరోజులు ఆలస్యంగా వేతనాలు అందుతున్నా యి. వైద్యారోగ్యశాఖ పరిధిలో అనేక విభాగాలు ఉండగా.. ప్రధానంగా డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), టీవీవీపీ పనిచేస్తున్నాయి. ప్రస్తుతం టీవీవీపీ కింద సుమారు 7 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
తమను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)గా మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైల్ చివరి దశలో ఉన్నా.. నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది.ఓవైపు టీవీవీపీని డీఎస్‌హెచ్‌గా మారుస్తామని చెప్తూనే.. మరోవైపు టీవీవీపీని, డీపీహెచ్‌ను విలీనం చేస్తామని, వైద్యసేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి కొత్త డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పు డు 1987 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్తు (ఏపీవీవీపీ) ఏర్పాటయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం టీవీవీపీగా ఆవిర్భవించింది. మొదటి నుంచీ సొసైటీగానే కొనసాగుతున్నది. మిగతా వైద్యసిబ్బందితో సమానంగా సేవలు అందిస్తున్నా.. తమకు వారితో సమానంగా వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు అందటం లేదని, ప్రభుత్వంలో విలీనం చేయాలని టీవీవీపీ సిబ్బంది కోరుతున్నారు.
ఏపీలో గత ఏడాది ఆగస్టులో ఏపీవీవీపీని ప్రభుత్వం డీఎస్‌హెచ్‌గా మార్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు టీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై సెప్టెంబర్‌లో కమిటీని నియమించింది. దీనికి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ చైర్మన్‌గా, డీఎంఈ, డీపీహెచ్ సభ్యులుగా, టీవీవీపీ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వానికి నవంబర్‌లో నివేదిక అందజేసింది.
టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని సిఫారసు చేసింది. ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. నివేదికను అమలు చేయాలంటూ టీవీవీపీ ఉద్యోగులు ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్‌హెచ్ ఏర్పాటు చేయాలని, సమయానికి వేతనాలు అందించాలని కోరుతున్నారు.