హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టీవీ 9 న్యూస్ చానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి, వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లెలచెరువు సాంబశివరావు (81) మృతి చెందారు. హైదరాబాద్‌లోని నివాసంలో మంగళవారం ఉదయం గుండెనొప్పి రావడంతో ఆయనను ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెల్లెలచెరువు సాంబశివరావు బీఎస్ఎన్ఎల్, పోస్టల్ అండ్ టెలికం రంగాల్లో సాగిన అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.
ఆయన కొంతకాలంపాటు ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డీవోటీ పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. బుధవారం ఉదయం గుంటూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాంబశివరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న రజనీకాంత్‌ను కేటీఆర్ పలకరించి, మనోధైర్యం చెప్పారు. సాంబశివరావు మరణవార్త తెలియగానే హరీశ్‌రావు హైటెక్‌సిటీలోని యశోద దవాఖానకు చేరుకుని రజనీకాంత్‌ను ఓదార్చారు.