మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 29 : ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో పత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై దాడులు చేశారని, వాటి గురించి కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇవే చానళ్ల కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకుంటారా? అని నిలదీశారు. తప్పుడు ప్రసారం చేసిన చానల్‌పై దాడులు జరగలేదని, కేవలం నాయకుల మీద అభిమానంతో నిరసన తెలిపారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులందరినీ విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.