హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులపై అసత్య ప్రచారం చేసిన ఓ టీవీ చానల్‌పై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారులపై సదరు చానల్ ప్రసారం చేసిన కథనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కే రామకృష్ణారావు, కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం ప్రకటన విడుదల చేశారు. చానల్ వార్తా కథనంలో మహిళా అధికారుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని ఐఏఎస్ అధికారుల సంఘం పేరొన్నది. ‘ఫ్యామిలీ డిసంఫర్ట్’లను గుర్తించకుండా వాట్సాప్ చాటింగ్స్, ఫోన్‌కాల్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా కథనాలను అల్లడం జర్నలిజం విలువలకే విరుద్ధమని సంఘం నేతలు ధ్వజమెత్తారు.
మహిళా అధికారులకు స్వల్ప కాలంలోనే ‘కంఫర్ట్ పోస్టింగ్స్’ ఇస్తున్నారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఇది అధికారుల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించే కుట్రగా అభివర్ణించారు. ఈ విధమైన రిపోర్టింగ్ మహిళా అధికారుల పట్ల అత్యంత విద్వేషపూరితమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య కథనాలను వెనకి తీసుకొని, మహిళా అధికారులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చానల్‌పై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. నిబద్ధతతో పనిచేసే అధికారుల ప్రతిష్ఠను దిగజార్చే ఏ ప్రయత్నన్నైనా అడ్డుకుంటామని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.
ఖండించిన ఐపీఎస్‌ల సంఘం
తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘానికి సంఘీభావం తెలుపుతూ ఐపీఎస్ అధికారుల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసింది. మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొన్ని మీడియా వేదికలు చేసిన ప్రసారాలను తీవ్రంగా ఖండించింది. మహిళా అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, వారి పోస్టింగులపై తప్పుడు ప్రచారాలు చేయడం కేవలం సంచలనం కోసం చేస్తున్న కుట్రగా అభివర్ణించింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న మీడియా సంస్థలు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ కథనాలను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఐపీఎస్‌ల సంఘం అధ్యక్షుడు, డీజీపీ బీ శివధర్‌రెడ్డి, కార్యదర్శి విక్రమ్‌సింగ్‌మాన్ హెచ్చరించారు.
విశ్వసనీయతను దెబ్బతీస్తాయి
సదరు చానల్లో ప్రసారమైన కథనంలో మహిళా ఐఏఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారాలులేనివి అని సంఘం అధ్యక్షుడు జీ రామలింగం, సెక్రటరీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఈ తరహా సంచలనాత్మక ప్రసారాలు ప్రజాసంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపపడ్డారు. జర్నలిజం పేరుతో నిర్ధారణలేని ఆరోపణలను వార్తలుగా ప్రసారం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. సంబంధిత అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారుల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, సహచర అధికారులకు మద్దతు ఉంటుందని చెప్పారు.