హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్లు జారీచేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(టీయూడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ సూచనల మేరకు రాష్ట్ర కమిటీ నాయకులు సోమవారం సమాచార, పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ హరీష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి రెండేళ్లకోసారి విధిగా జారీచేయాల్సి ఉండగా, ఆరు నెలలుగా కార్డుల జారీలో జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు.
ఇప్పటికే వివిధ కారణాలతో రెండు దఫాలుగా గడువును పొడిగించారని, దీంతో మూడు నెలలకోసారి బస్‌పాస్‌లు తీసుకోవడం, కార్డులపై స్టిక్కర్లు అతికించుకోవడం జర్నలిస్టులకు ప్రహసంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, ఉపాధ్యక్షుడు రమేశ్ హజారీ, టెంజు ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, కోశాధికారి యోగానంద్, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ తదితరులున్నారు.