ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 15: ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామన్ నాగరాజుపై ప్రభుత్వం ఇటీవల పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. టీ న్యూస్ జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకులు, ప్రెస్క్లబ్ల బాధ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఖమ్మంలో టీజేఎఫ్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కొత్తగూడెంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తల్లాడ, కారేపల్లి ప్రెస్క్లబ్ల ఆధ్వర్యంలోనూ ఆయా మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన తెలిపారు.
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు ఇంటికి సోమవారం వెళ్లిన నేతలు.. కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పి, సాంబశివరావుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్షకుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యత్నం చేస్తున్న రైతు సంఘాల నాయకులు, జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయిస్తూ నిర్బంధించడం విచారకరమని చెప్పారు. సాంబశివరావుపై పెట్టిన కేసును తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.