Jagtial | జగిత్యాల, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): జగిత్యాల కాంగ్రెస్‌లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్‌కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మా రొద్దంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డి అనుచరుల కు వివిధ నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్ హామీ ఇస్తూ వచ్చారు. తీరా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసే సమయానికి ఎమ్మెల్యేకు నచ్చిన వారి పేర్లు మాత్రమే సిఫార్సు చేస్తుండటంతో కాంగ్రె స్ నాయకుల్లో అసహనం మొదలైంది.
జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణంకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరో సీనియర్ నాయకుడు గాజెంగి నందయ్య మంత్రి అడ్లూరి ఆశీస్సులతో కాంగ్రె స్లోనే కొనసాగుతున్నాడు. జీవన్‌రెడ్డి మరో అనుచరుడు బండ శంకర్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లేదా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పలువురికి ము న్సిపల్ కో ఆప్షన్ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. కాగా అసంతృప్త నేతలకు సోమవారం సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లభించింది. దీంతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా సీఎం అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. సీఎం అపాయింట్మెంట్ ను ఎమ్మెల్యేనే క్యాన్సిల్ చేయించాడని అసంతృప్త నేతలు రగిలిపోతున్నారు.