న్యూఢిల్లీ, ఆగస్టు 13 : దేశీయ ఎగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. గత నెలలో 44.24 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో అయిన ఎగుమతులతో పోలిస్తే 19.6 శాతం చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో భారత్ 76.22 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 17.52 శాతం అధికమయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఆరు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. గత నెలలో వాణిజ్యలోటు 31.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పెట్రోలియం ఉత్పత్తులు అధికంగా దిగుమతి చేసుకోవడం వల్లనే వాణిజ్యలోటు పెరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒక జూలై నెలలోనే 18.31 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకున్నది. కిందటేడాదితో పోలిస్తే ఇది 17.64 శాతం అధికం.
అతి విలువైన లోహాల దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో వీటి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పసిడి దిగుమతులు కేవలం 4.77 శాతం పెరిగి 4.16 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వెండి దిగుమతులు 66 శాతం తగ్గి 171.68 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే 13 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ రెండు లోహాలపై సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు గోల్డ్ దిగుమతులు 32.41 శాతం ఎగబాకి 15.17 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వెండి దిగుమతులు 50.81 శాతం తగ్గి 718.42 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశంలోకి వస్తున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అవుతున్నదని, అలాగే యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున వస్తున్నది. జూలై నెలలో స్విట్జర్లాండ్ నుంచి 2 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న భారత్‌లో ఆభరణాలకు ఎనలేని డిమాండ్ ఉన్నది.
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. గత నెలలో పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో అయిన ఎగుమతులతో పోలిస్తే ఇది 8.62 శాతం అధికం. ప్రధానంగా పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 67 శాతం అధికమయ్యాయని రాజేశ్ అగర్వాల్ తెలిపారు. యూఏఈకి 10 శాతం పెరుగగా, సౌదీ అరేబియాకు 2.73 శాతం తగ్గాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 72 డాలర్ల నుంచి 95 డాలర్లకు చేరుకోవడంతో భారత్ అధికంగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో వాణిజ్యలోటు ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడానికి యుద్ధమే కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తం దిగుమతుల్లో క్రూడాయిల్ వాటా 24 శాతంగా ఉండటం ఇందుకు కారణం. ఇదే సమయంలో ఎగుమతులు కూడా భారీగా పుంజుకున్నాయి. జూన్ 2022 తర్వాత ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరుగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఎగుమతులు 17 శాతం ఎగబాకి 173.78 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 19 శాతం అధికమై 292.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో వాణిజ్యలోటు 118.60 బిలియన్ డాలర్లు. ముడి పత్తి, పప్పుదినుసులు, ఎరువులు, బొగ్గు, కోక్, కెమికల్స్, ప్రాజెక్ట్ గూడ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకున్నది. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ..పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు పెరుగడం శుభసూచకమన్నారు.