మలక్‌పేట, ఆగస్టు 13 : ప్రభుత్వరంగ సంస్థ మిధానీ మరో ఘనత సాధించింది. విస్తృత శ్రేణి రసాయన, యాంత్రిక, లోహ శాస్త్ర పరీక్షల కోజం జీఈ ఏరోస్పేస్ నుంచి స్వతంత్ర, అంతర్జాతీయ లోహ పదార్థ ప్రయోగశాల(ఎస్400) ఆమోదాన్ని పొందిన దేశంలో తొలి సంస్థ మిధానీ నిలిచిందని కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ కే మధుబాల తెలిపారు. లోహ పదార్థాల పరీక్ష, అర్హతలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ ప్రమాణాల పట్ల మా అచంచలమైన నిబద్ధతను ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ప్రతిబింబిస్తున్నదన్నారు.
ఈ విజయం ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు విశ్వసనీయ భాగస్వామిగా మిధానీ స్థానాన్ని మరింత బలపర్చనున్నదన్నారు. అధునాతన పదార్థాల రంగంలో ఆత్మనిర్భరత దిశగా మరో ముందడుగుగా ఇది నిలువనున్నదని చెప్పారు. మాపై విశ్వాసం ఉంచి, సహకరించిన జీఈ ఏరోస్పేస్‌కు మిధానీ తరుఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె అన్నారు. అంకితభావంతో పనిచేసి ఈ విజయాన్ని సాధ్యం చేసిన మా బృంద సభ్యుల నైపుణ్యం, నిబద్ధతకు అభినందనలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీఈ ఏరోస్పేస్ ప్రతినిధి చంద్రశేఖర్ యవర్నసాగర్ జవాలే, మిధానీ ప్రొడక్షన్, మార్కెటింగ్ డైరెక్టర్ పీ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.