రామగిరి, ఆగస్టు 13: బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు జడ్జి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్‌రావు గురువారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే .. కరీంనగర్‌కు చెందిన మహ్మద్ జాకీర్ బాబా సోషల్ మీడియా ద్వారా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఒక బాలికతో పరిచయం పెంచుకున్నారు. 2020 మే 30న మిర్యాలగూడకు వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, సీడీవో అఖిల్, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన ఆధారాలు సేకరించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్‌కుమార్ బలమైన వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. కిడ్నాప్ నేరానికి 5 సంవత్సరాలు, పోక్సో చట్టం కింద 20 ఏండ్ల కలిపి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతోపాటు బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.