ఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్‌లో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న భారత్.. అరంగేట్ర ఫిఫా ఆసియన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్) కప్ నుంచి వైదొలిగింది. దక్షిణాసియా దేశాల కోసం ఫిఫా తీసుకొచ్చిన ఈ టోర్నీలో ఆడేందుకు తొలుత ఆమోదం తెలిపిన భారత్.. తర్వాత బ్రెజిల్ మ్యాచ్‌తో షెడ్యూల్ క్లాష్ కారణంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఫిఫా ఆసియన్ కప్ సెప్టెంబర్ 21న మొదలై అక్టోబర్ 4తో ముగియనుండగా భారత్, బ్రెజిల్ మ్యాచ్ అక్టోబర్ 3న జరగాల్సి ఉంది. టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఏఐఎఫ్ఎఫ్ జనరల్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ స్పందిస్తూ.. ‘అవును. మేం ఆసియన్ కప్ నుంచి వైదొలిగాం.
షెడ్యూలే ఇందుకు ప్రధాన కారణం. ఏకకాలంలో రెండు మ్యాచ్‌లను ఆడటం కష్టం. ఆసియన్ కప్ ఫైనల్ అక్టోబర్ 4న జరుగుతుంది. కానీ మాకు బ్రెజిల్‌తో అక్టోబర్ 3న మ్యాచ్ ఉంది. బ్రెజిల్‌తో పోరు మాకు అతిపెద్ద అవకాశం. ఆసియన్ కప్‌లో ఉన్న దేశాలతో (సింగపూర్, మలేషియా, ఇండోనేషియా) మేం గతంలో చాలా మ్యాచ్‌లు ఆడాం. భవిష్యత్‌లోనూ ఆడతాం. కానీ బ్రెజిల్‌తో మ్యాచ్ ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రపంచంలో ఐదో ర్యాంకులో ఉన్న బ్రెజిల్.. 138వ ర్యాంకు కల్గిన మాతో ఆడేందుకు వస్తుండటం మాకు అతిపెద్ద విషయం. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశాన్ని మేం కోల్పోదలుచుకోలేదు’ అని తెలిపాడు.