నిజామాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దుంపకుళ్లు తెగులు ప్రభావంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు 15-20 క్వింటాలు రావడం గగనమైపోయింది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పసుపు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేయగా.. మార్కెట్లో దళారులు నిండా ముంచుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గతంలో 50 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. నష్టాలకు తోడు మద్దతు ధర దక్కకపోవడం, పెట్టుబడి సాయం అందకపోవడంతో సాగు విస్తీర్ణం 32 వేల ఎకరాలకు పడిపోయింది. సాధారణంగా ఈ విస్తీర్ణంలో 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, దుంపకుళ్లు కారణంగా 5-7 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావడమే కష్టంగా మారింది. పంట దిగుబడి తగ్గితే ధర పెరగాలి. కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. క్వింటాలుకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకే చెల్లిస్తున్నారు.
సంక్రాంతి రోజున హడావుడిగా పసుపుబోర్డును ప్రారంభించిన బీజేపీ ఎంపీ అర్వింద్ ఇప్పుడు పత్తా లేకుండాపోయారు. నేమ్ ప్లేట్కే పరిమితమైన పసుపుబోర్డుతో రైతులకు ఒరిగిందేమీ లేదు. అంతేకాదు, గతంలో ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు ద్వారా కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ నేపథ్యంలో పసుపు పంటకూ రూ.500 బోసన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
7 ఎకరాల్లో పసుపు సాగు చేసిన. ఎకరాకు రూ.లక్షన్నర లెక్కన పది లక్షల దాకా ఖర్సయింది. దిగుబడి మునుపటి లెక్క లేదు. సరైన ధర అత్తలేదు. రేటు రాక, పంట ఎళ్లక రైతు నష్టపోతుండు.
– మిట్టపల్లి ముత్తెన్న, పసుపు రైతు
దుంపకుళ్లు సోకి పంట దిగుబడి తగ్గిపోయింది. బిగాన రూ.15 వేల దాకా ఖర్సు పెట్టి మందులు స్ప్రే చేయించినా లాభం లేకపాయే. అనుకున్నట్టు పంట ఎళ్లకపాయే. తక్వల తక్వ క్వింటాలుకు రూ.15 వేలు ధర ఉంటేనే రైతుకు ఫాయిదా.
– మిట్టపల్లి చిన్నయ్య, పసుపు రైతు