నిజామాబాద్: ఆర్టీఏ అధికారులమంటూ పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేశారు. డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మర్చుతుండగా పోలీసులకు చిక్కిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి పసుపు లోడుతో ఓ లారీ ఏపీలోని గుంటూరుకు బయల్దేరింది. ఇందల్వాయి టోల్‌ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమంటూ ఆ లారీని ఆపారు. దీంతో లారీని ఆపిన డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు.
దానిని నిజామాబాద్‌కు తీసుకువచ్చి జిల్లా కేంద్రంలో పలు చోట్ల పసుపు విక్రయించారు. తర్వాత నవీపేట మండలంలో జన్నేపల్లికి తీసుకెళ్లారు. అక్కడ అమ్మగా మిగిలిన పసుపు బస్తాలను మరో మూడు వాహనాల్లోకి నింపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందడటంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మూడు వాహనాలను, డ్రైవర్లను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. లారీలో మొత్తం రూ.50 లక్షల విలువ చేసే లోడ్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమేదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.