మెట్పల్ల్లి, మార్చి 4: పసుపునకు కనీస మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతు ఐక్యవేదిక నాయకులు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు క్రయ,విక్రయాల తీరును పరిశీలించారు. పసుపునకు పలుకుతున్న ధరల తీరుపై నిరసన తెలిపారు. గిట్టుధర లభించక రైతు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు వచ్చినప్పటికీ మద్దతు ధర ప్రకటించకపోవడంతో నష్టపోతున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపునకు కనీసం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ విడుదల చేసిన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌దారులు పెద్ద సంఖ్యలో మార్కెట్లో ఉన్నప్పటికీ కేవలం ఐదారుగురు మాత్రమే ఆన్లైన్ వేలంలో పాల్గొనడం బాధాకరమని, పోటీలేకపోవడంతో ఇష్టారీతిగా ధరలకు కొనుగోలు చేస్తుండటం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు.
తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మద్దతు ధరను ప్రకటించి నాఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో పసుపు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మామిడి నారాయణరెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి, యాళ్ల తిరుపతిరెడ్డి, కాటిపెల్లి నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.