మెట్పల్ల్లి, మార్చి 11 : పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర ప్రకటించి తమను ఆదోకోవాలని మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రోడ్డెక్కారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పసుపు రైతులు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. పసుపునకు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని, ఎంఐఎస్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రాలను ప్రారంభించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ గానీ, ఆర్డీవో గానీ వస్తే తమ గోడును చెప్పుకుంటామని, అంత వరకు ధర్నా విరమించేదిలేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్ అక్కడికి రాగా, రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో రైతు ఐక్యవేదిక నాయకులు, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
కంఠేశ్వర్, మార్చి 11: గిట్టుబాటు ధర కోసం పసుపు రైతులు మంగళవారం కూడా ఆందోళనకు దిగారు. పసుపు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు సిండికేట్ అయి ధర రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న దోపిడీపై కలెక్టర్ పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా రైతు పక్షపాతమే అని చెప్తున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలి. మద్దతు ధరల జాబితాలో పసుపు పంటను చేర్చాలి. అప్పుడే పసుపు రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్లో పంట విక్రయించిన తర్వాత డబ్బులు చెల్లించేందుకు వ్యాపారులు 2 శాతం క్యాష్ కటింగ్ చేయడం సరికాదు. దీనిపై చర్యలు తీసుకోవాలి.