తెలంగాణకు నీళ్లు పారడమా? గ్రావిటీ ద్వారానా?.. అదీ శ్రీశైలం ద్వారానా? ఇంకేమైనా ఉన్నదా? తెలంగాణ పచ్చబడిపోదూ! సీమకు నీళ్లు కరువైపోవూ! ఇవ్వడానికి మనసొప్పదు.. ఇవ్వకుంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. మరేం చేయాలి? ఇచ్చినట్టే ఉండాలి! కానీ ఇచ్చిన ఫలితం దక్కకూడదు! అలాంటి కుట్రల మధ్య పుట్టిందే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)!. చర్చల పేరిట సాగదీత.. సర్వేల పేరిట కాలయాపన.. అనుమతులు రావని తెలిసిన చోటునే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు! వేగంగా పూర్తికాకుండా షరతులు.. నిర్మాణానికి నిధులివ్వరు. పట్టాలెక్కడం ఒక వంతయితే.. ఆ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు పోకుండా అవరోధాలు కల్పించడం.. నిర్మాణం కొనసాగకుండా నిర్వీర్యం చేయడం, నీళ్లు రాకుండా అడ్డుకోవడం మరోవంతు! ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణ దైన్యానికి నిలువెత్తు సజీవ సాక్ష్యమిది!. అదొక అంతులేని కథ! కాంగ్రెస్ పాలకులు తగిలించిన గుదిబండతో ఇప్పటికీ తెలంగాణకు తీరని వ్యథ!
– మ్యాకం రవికుమార్
SLBC | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో నిర్దేశించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.50 కిలోమీటర్ల మొదటి సొరంగ మార్గం ద్వారా డిండి నది వద్ద నిర్మించే రిజర్వాయర్‌లో (నక్కలగండి తండా) కలుపుతారు. అక్కడి నుంచి 7.21 కిలోమీటర్ల రెండో సొరంగం ద్వారా నేరడిగొమ్మ వరకు, ఆపై 3.2 కిలో మీటర్ల ఓపెన్ చానల్ ద్వారా పెండ్ల్లిపాకల రిజర్వాయర్‌కు తరలిస్తారు. గుర్రంపోడు, కనగల్లు మండలాల మీదుగా ఉదయసముద్రం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి అయిటిపాముల ట్యాంక్ మీదుగా మూసీలో కలుస్తుంది. ఇదీ ఎస్ఎల్బీసీ హైలెవల్ కెనాల్ వెళ్లే మార్గం. కానీ 1995 వరకు ఎస్ఎల్బీసీ పనులు పట్టాలెక్కలేదు. అటు తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సొరంగ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూనే నాగార్జునసాగర్ ఫోర్‌షోర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎస్ఎల్బీసీ హైలెవల్ కెనాల్‌కు, హైదరాబాద్‌కు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సాగర్ నుంచి జలాలను పుట్టంగండి పంపింగ్ స్టేషన్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కలుపుతారు. అక్కడి నుంచి జలాలను ఎస్ఎల్బీసీలో భాగంగా నిర్మించిన హైలెవల్ కెనాల్‌కు 25వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. అయితే ఎస్ఎల్బీసీ గ్రావిటీ ద్వారా 4 వేల క్యూసెక్కులు రానుండగా, లిఫ్ట్ ద్వారా ప్రస్తుతం కేవలం 2400 క్యూసెక్కులనే తరలిస్తున్నారు. తదనంతరం ప్రాజెక్టు మొత్తానికి ఎస్ఎల్బీసీ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
ప్రహసనంలా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు
టన్నెల్ అనుమతులు ఆలస్యమవడం, తెలంగాణ సమాజం నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించారు. 1983 నుంచి 1989 వరకు టీడీపీ హయాంలో కాలువ పనులు సాగాయి. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ సొరంగం స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. సొరంగం పూర్తయ్యే వరకు పనులను నిలిపేయాలని ఆదేశించింది. అయిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రభుత్వం మళ్లీ 1994లో కేంద్రం నుంచి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది. ఆ తర్వాత డీపీఆర్ తయారీ సమయంలో కాంగ్రెస్ పోయి టీడీపీ రాగానే మళ్లీ సొరంగం స్కీమ్‌ను పక్కనపెట్టింది. నాగార్జునసాగర్ నుంచి లిఫ్ట్ పనులనే పునఃప్రారంభించింది. 2004లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకే మొగ్గుచూపింది. 2005లో టన్నెల్ పనులను ప్రారంభించింది. రెండు వైపుల నుంచి పనులు ప్రారంభించింది. నిధులు విడుదల చేయకపోవడంతో దశాబ్దాలు గడచినా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 34.372 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.560 కిలో మీటర్ల మేర తవ్వాల్సి ఉన్నది.
ప్రాజెక్టు నిర్వీర్యానికి అనేక కుట్రలు
ప్రాజెక్టును నీరుగార్చేందుకు సీమాంధ్ర పాలకులు చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. అయినా ప్రాజెక్టుపై నల్లగొండ రైతాంగం పట్టువీడలేదు. 1996 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి 450 మందికి పైగా నామినేషన్లు వేశారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడికీ సీమాంధ్ర పాలకులు కుట్రలను ఆపలేదు. 2003లో స్ప్రింక్లర్ ప్రాజెక్టుగా ప్రకటించి కోట్ల రూపాయాలు వెచ్చించి ఆస్ట్రియా దేశం నుంచి సామగ్రి తెప్పించారు. వాటి నిర్వహణకే ఏడాదికి రూ.10 లక్షల వ్యయం అవుతున్నది. ఏడాది తిరక్కుండానే ప్రాజెక్టు నిర్వహణ భారాన్ని రైతులపైన వేయడంతో ఈ పథకం అటకెక్కింది. 2005లో మళ్లీ ఓసారి స్ప్రింక్లర్ విధానం వద్ద కన్వెన్షనల్ స్ప్రింక్లర్స్ పేరుతో మరో కుట్రకు తెరతీశారు. కరెంట్ సరఫరా లేకపోవడంతో ఇది భ్రష్టుపట్టింది. ఈ కుట్రలన్నింటినీ నాడు ఉద్యమనేత కేసీఆర్ పటాపంచలు చేశారు. ఆంధ్రాకు గ్రావిటీ ఏంది? తెలంగాణకు స్ప్రింక్లర్లు ఏంది? తెలంగాణను నాశనం చేయడానికా? అని గర్జించారు.
అడుగు పెట్టవద్దు.. సౌండ్ 50 డెసిబుల్స్ దాటవద్దు
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో శ్రీశైలం నుంచి డిండి రిజర్వాయర్ వరకు 43.50 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉన్నది. టన్నెల్ అలైన్మెంట్ మొత్తం కూడా అభయారణ్యం నుంచే ఉన్నది. దీంతో కేంద్రం అనుమతులిచ్చేందుకు దశాబ్దకాలం పట్టింది. ఎట్టకేలకు 1994లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి కేంద్రం ఇచ్చింది. అయితే అనేక కఠిన షరతులను విధించింది. అభయారణ్యంలోకి అడుగు కూడా పెట్టవద్దని తేల్చిచెప్పింది. కేవలం భూమి కింద నుంచి సొరంగం తవ్వుకోవాలని షరతు విధించింది. వఅఖరికి సొరంగం తవ్వడానికి ముందు అధ్యయనం చేయడానికి హెలికాప్టర్‌ను వినియోగిస్తే దాని శబ్దం 50 డెసిబుల్స్ దాటకూడదని నిబంధనలు విధించింది. అంటే వ్యాక్యూమ్ క్లీనర్ నుంచి ఎంత శబ్దం వస్తుందో అంతకు మించి రాకూడదు. జియోలాజికల్ సర్వేకు అభయారణ్యంలో బోర్ హోల్స్‌కు అనుమతి లేదు. ఇలాంటి అనేక షరతులతో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది.
కాంగ్రెస్ తగిలించిన గుదిబండ
ప్రాజెక్టు సుదీర్ఘకాలం పాటు ముందుకుపోకుండా ఉండేందుకు ప్రధాన కారణం అభయారణ్యం గుండా టన్నెల్‌ను ప్రతిపాదించడమే! ఆపై సొరంగం తవ్వకానికి ఎంచుకున్న టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) టెక్నాలజీనే! సుదీర్ఘమైన సొరంగాలను తవ్వేందుకు సాధారణంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ టెక్నాలజీని వినియోగిస్తారు. చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఆడిట్ పాయింట్లు (గాలి, వెలుతురు వచ్చేందుకు, తవ్వకంలో వచ్చే మట్టి, రాళ్లను తరలించేందుకు మార్గాలు) ఏర్పాటు చేసుకుని సొరంగం తవ్వకాన్ని పూర్తిచేస్తారు. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ అభయారణ్యంలో ఉండడంతో ఆడిట్పాయింట్లకు అవకాశం లేకుండాపోయింది. మరోవైపు వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు భూప్రకంపనలు, శబ్దాలు రాకుండా ఉండేందుకు దాదాపు భూఉపరితలం నుంచి 450 మీటర్ల దిగువ నుంచి సొరంగాన్ని తవ్వాలని నిర్ణయించారు. అదీగాక నీటి ఊట కూడా ప్రధాన సమస్య. నిరంతరాయంగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగాల్సిందే! పొడవైన, లోతైన టన్నెల్ కావడంతో 2-3 గంటల పనిచేస్తే అలసిపోయే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థ కూడా పనుల జాప్యానికి కారణం. పనులను దక్కించుకున్న సదరు ఏజెన్సీ అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీకి సొరంగం తవ్వకం పనులను సబ్‌కాంట్రాక్టు ఇచ్చింది. ఆ కంపెనీయే టీబీఎంను సప్లయ్ చేసింది. మిషన్ పరికరాలు మరమ్మతులకు గురైతే అక్కడి నుంచే నిపుణులు, మిషన్ స్పేర్ పార్ట్స్ రావాల్సిందే! అందుకు నెలల తరబడి సమయం పడుతుంది.
ముందుకు పోదు.. వెనక్కి రాదు..
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లోని టీబీఎం గరిష్ఠ సామర్థ్యం గంటకు 2.5 మీటర్లు. కానీ ప్రస్తుతం అది 24 గంటల్లో గరిష్ఠంగా 6 మీటర్లకు మించి తవ్వకాన్ని పూర్తి చేయడం లేదంటే అక్కడి అసాధారణ పరిస్థితులను అంచనా వేయవచ్చు. దీన్ని ఇప్పుడు తొలగించి అధునాతన టెక్నాలజీని వినియోగించి తవ్వుదామన్నా అదీ కుదరని దుస్థితి. కారణం ప్రస్తుతం టీబీఎం బోరింగ్ మెషీన్ వ్యాసార్థం (డయా) 10 మీటర్లు. ఆ వ్యాసార్థంతో రాతిపొరలను తొలుస్తూ ముందుకు వెళ్తుంది. సొరంగం కూలిపోకుండా సిమెంట్ సెగ్మెంట్లను అమర్చడం వల్ల ఫినిషింగ్ డయా 9.2 మాత్రమే ఉంటుంది. దీంతో 10 మీటర్ల డయా కలిగిన టీబీఎం బయటకు రాలేదు. అంటే కేవలం ముందుకు మాత్రమే వెళ్లగలుతుంది. వెనక్కి తీసే అవకాశమే లేదు. సొరంగం తవ్వకం పూర్తయ్యాక అక్కడే ఒక పక్కగా తవ్వి టీబీఎంను అందులోనే పూడ్చి పెడతారు. అదీగాక ఈపీసీ విధానంలో కాంట్రాక్టు రద్దు చాలా వరకు అసాధ్యం. ఒకవేళ చేసినా ఏజెన్సీకి కోట్లాది రూపాయలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సర్కారు ఎంచుకున్న ప్రాంతం.. టెక్నాలజీ.. విధించిన నిబంధనలే ప్రాజెక్టు పనులకు గుదిబండగా మారాయి.
తెలంగాణను ఏమార్చేందుకే!
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఏర్పాటే తెలంగాణను ఏమార్చేందుకు, కృష్ణా జలాలను యథేచ్ఛగా సీమకు తరలించుకునేందుకే అంటే అతిశయోక్తేమీ కాదు. రాయలసీమకు కృష్ణాజలాలను మళ్లించేందుకు ఉమ్మడి ఏపీలో నాటి పాలకులు అనేక కుట్రలకు తెరలెపారు. చెన్నైకి సాగునీళ్లు అందించే సాకుతో శ్రీశైలం రిజర్వాయర్ గట్టుకు తొలుత గండిపెట్టారు. ఆ తర్వాత రాయలసీమలో లక్షల ఎకరాలకు సాగునీరందించే తెలుగు గంగ ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఆర్బీసీ) ద్వారా 19 టీఎంసీలు వినియోగించుకునేలా అనుమతులూ తెచ్చుకున్నారు. అయితే చెన్నైకి, బేసిన్ అవతల రాయలసీమకు జలాలను తరలించే ప్రణాళికపై తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. తెలంగాణ శాంతించాలంటే శ్రీశైలం ఎడమ వైపు (తెలంగాణ) కూడా ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రకటించాలని ఎస్ఎల్బీసీని తెరపైకి తెచ్చారు. దీంతో 1981లో అఖిలపక్షం తీర్మానం మేరకు శ్రీశైలం రిజర్వాయర్‌కు కుడి వైపునే కాకుండా, ఎడమ వైపున కూడా కాలువలు తవ్వాలని నిర్ణయించారు. కుడివైపు అంటే ఏపీ వైపున రిజర్వాయర్ గట్టుపై 854 ఫీట్ల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని నిర్మించి, అక్కడి నుంచి బనకచర్లకు మళ్లించి, ఆపై మూడు కాలువల ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ (ఎస్ఆర్బీసీ), నిప్పుల వాగు ఎస్కేప్ చానల్‌కు ప్రణాళికలను సిద్ధం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు వైపు అంటే తెలంగాణ వైపు 854 ఫీట్ల వద్ద సొరంగం తవ్వి తద్వారా నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరందించాలని నిర్ణయించారు. కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ)కి సంబంధించిన పనులన్నీ 1988 వరకే చకచకా పూర్తిచేశారు. కానీ తెలంగాణకు సంబంధించిన ఎస్ఎల్బీసీ సొరంగం దశాబ్దాలు గడచినా ఇప్పటికీ పూర్తికాకపోవడం విషాదకరం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్, టీడీపీ సర్కార్లు తెలంగాణ ప్రాజెక్టులపై చూపిన వివక్షకు.. ఇప్పటికీ పూర్తికాని ఎస్ఎల్బీసీ సొరంగమే నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
అసెంబ్లీ వేదికగా సవాళ్లను వివరించిన కేసీఆర్
ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకంలో ఎదురయ్యే సవాళ్లను, టెక్నాలజీ పనితీరును అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టు పరిస్థితులను గూగుల్ మ్యాపు ఆధారంగా తెలియజేశారు. పనుల పురోగతిలో సంక్లిష్టతను తెలిపి వాపోయారు. తదనంతరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులను ముందుకు తీసుకెళ్లారు. టీబీఎం సొరంగాన్ని తవ్వే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం, సొరంగం పొడవు పెరిగిన కొద్దీ కార్మికులు పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, సీపేజీ ఎక్కువ రావడం సవాలుగా నిలిచింది. సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. డీవాటరింగ్ సిస్టమ్‌ను మెరుగుపరచి డిసెంబర్ 2019 వరకు నీటిని తొలగించారు. కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పటివరకు చెల్లిస్తున్న డీవాటరింగ్ చార్జీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే సవరించి పెంచింది.
కాంట్రాక్టు సంస్థ కరెంటు బిల్లులను సక్రమంగా చెల్లించకపోవడం, టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం, ఫలితంగా డీవాటరింగ్ నిలిచి టీబీఎం పాక్షికంగా మునిగి పనులు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. విషయాన్ని తెలుసుకొని ఆ కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ బిల్లును ఏజెన్సీకి చెల్లించే బిల్లుల నుంచి మినహాయించుకుంటుందని, కరెంటు సరఫరాను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయవద్దని టీఎస్ఎస్పీడీసీఎల్కు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం సొరంగం తవ్వుతున్న ప్రాంతంలో షియర్ జోన్ నుంచి భారీ సీపేజీ రావడాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టేవరకూ పనులు నిర్వహించవద్దని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది.
ప్రాజెక్టు పట్టాలెక్కిన తీరిది!