Tungabhadra | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. కృష్ణా జలాలపై ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో తుంగభద్రపై ఎక్కడపడితే అక్కడ ప్రాజెక్టులను చేపట్టకుండా ట్రిబ్యునల్ అనేక ఆంక్షలు విధించింది. దీనినిబట్టి తుంగభద్ర ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఒకవైపు కర్ణాటక, మరోవైపు ఏపీ ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ట్రిబ్యునల్ అవార్డును తుంగలో తొక్కుతూ ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ తుంగభద్ర జలాలను ఎగువనే మాయం చేసే పన్నాగాలకు తెరలేపాయి. క్విడ్‌ప్రో విధానంలో అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు రాష్ర్టాల చర్యతో శ్రీశైలం డ్యామ్‌కు ప్రవాహాలు రాకుండా పోతాయని, వెరసి తెలంగాణకు తీరని నష్టంవాటిల్లే ప్రమాదం ఉన్నదని నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉలుకూపలుకు లేకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలొస్తున్నాయి.
తుంగభద్ర డ్యామ్‌లో పూడికపెరిగి పూర్తిస్థాయి నీటిని వినియోగించుకోలేని పరిస్థితులున్నాయనే సాకుతో ప్రస్తుతమున్న లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు కర్ణాటక సర్కారు సిద్ధమైంది. అదేవిధంగా 31 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఏపీలో 6,25,097 ఎకరాలు, తెలంగాణలో 87వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. డ్యామ్‌లో పూడిక పెరగడం, వరద ప్రవహాల్లో వచ్చిన మార్పులు, అవిరి నష్టాలతో కలుపుకుని ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నదని సాకులు చెప్తూ తాజాగా ఈ ప్రతిపాదనలను సిద్ధంచేసింది. మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని, ఈ నేపథ్యంలోనే కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువను తవ్వి తుంగభద్ర వరదను నావలికి తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడబలుక్కుంటున్నాయి. తుంగభద్ర జలాలను చెరబట్టేందుకు ఉమ్మడిగా అడుగులు వేస్తున్నాయి. నావలి విస్తరణ పేరిట కర్ణాటక, వరదమాటున కాలువ తవ్వకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు సిద్ధమవుతున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. దీంతో తుంగభద్ర జలాలు ఎగువనే మాయం కానున్నాయి. శ్రీశైలానికి జలాలు రాక తెలంగాణ ఎండిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కారు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నది.
తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. ఇందులో 105 కిమీ వరకు కర్ణాటకలో, అక్కడినుంచి 189వ కిమీ వరకు ఏపీలోని అనంతపురం జిల్లా గుండా పోతుంది. ఈ కాలువ నుంచి ఆ జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్, పెన్నార్ అహోబిలం రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. హెచ్ఎల్సీ ద్వారా ఏపీకి 32 టీఎంసీల జలాల కేటాయింపులు ఉన్నాయి. అంతేకాకుండా అవార్డులకు విరుద్ధంగా కేసీ కెనాల్‌కు సైతం అదనంగా దీని నుంచే జలాలను మళ్లిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేవలం కృష్ణాకు వరదలు వచ్చిన క్రమంలో వాటిని తక్కువ సమయంలోనే తరలించి అనంతపురం జిల్లాలకు అందిస్తామని చెప్తున్న ఏపీ సర్కారు.. హెచ్ఎల్సీ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు ప్రణాళికలు రూపొందించింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రణాళికలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్ (బచావత్ ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం కడప-కర్నూలు (కేసీ) కెనాల్‌కు సుంకేసుల బరాజ్ నుంచి మాత్రమే తుంగభద్ర నదీ జలాలను వాడుకోవాలి. కానీ, అందుకువిరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తున్నది. తుంగభద్ర నీటికి బదులుగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అనుమతుల్లేని మల్యాల, ముచ్చుమర్రి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీం పంపింగ్ స్టేషన్-1, ముచ్చుమర్రి వద్ద కేసీ కెనాల్ లిఫ్ట్ సీం ద్వారా, పోతిరెడ్డిపాడు దిగువన బనకచెర్ల వద్ద ఎసేప్ రెగ్యులేటర్ ద్వారా మొత్తం నాలుగు అదనపు మార్గాల ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు మళ్లిస్తున్నది. అంతేకాదు తుంగభద్ర డ్యాం కుడివైపు హై లెవెల్ కెనాల్ ద్వారా కూడా మళ్లిస్తున్నది. అందుకు కర్ణాటక కూడా అంగీకారం తెలుపుతున్నది. దీనిని బట్టే ఇరు రాష్ర్టాలు కూడా తుంగభద్ర జలాలను ఎగువనే మాయం చేసేందుకు పరస్పరం సహరించుకుంటూ ముందుకు సాగుతున్నాయని తెలిసిపోతున్నది.
కర్ణాటక ప్రతిపాదనలను ఆదిలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. నావలి రిజర్వాయర్ ప్రతిపాదనలకు అంగీకారం తెలపాలని 2022లో కర్ణాటక ప్రతిపాదించగా, ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని బీఆర్ఎస్ సర్కార్ స్పష్టంచేసింది. ట్రిబ్యునల్-2 అవార్డు అమలులోకి వచ్చేంతవరకూ ఆ ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని తుంగభద్ర బోర్డు మీటింగ్‌లోనూ తేల్చిచెప్పింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మాత్రం నోరు మెదపని దుస్థితి నెలకొన్నది. ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు ప్రాజెక్టుల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నా, బోర్డులోనూ చర్చకు పెడుతున్నా కిక్కురుమనడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రణాళికల అమలును ఆ రెండు రాష్ర్టాలు మరింత ముమ్మరం చేయడం గమనార్హం. అదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా పలువురు నేతలు ప్రస్తావించడంతోపాటు కర్ణాటకను అడ్డుకునేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ రేవంత్ సర్కారు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
కర్ణాటక, ఏపీ రాష్ర్టాల ప్రతిపాదనలు అమలైతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుంది. కృష్ణా నదికి తుంగ, భద్రలు ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రాజెక్టులను నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. షరతులు పెట్టింది. కానీ, కర్ణాటక సర్కారు ఇప్పటికే ఆ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పుడు ఏకంగా నావలి, కొత్తగా మరికొన్ని బరాజ్‌ల నిర్మాణానికి పూనుకున్నది. ఇక ఏపీ సైతం వరదజలాల పేరిటనే ప్రాజెక్టులను చేపడతామని చెప్తూ తరువాత అనేక కుట్రలకు తెరలేపింది. ఆ రెండు రాష్ర్టాలు చేస్తున్న ప్రణాళికలు అమలైతే భవిష్యత్‌లో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడిన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాలు రావడమే గగనమైపోతుందని వివరిస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎల్లకాలం ఎండుడేనని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్‌కు కేంద్రం జారీచేసిన సెక్షన్-3 టీ వోఆర్ను రద్దు చేయాలని ఏపీ సర్కారు సుప్రీంకోర్టు కు విజ్ఞప్తిచేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే విచారణ చేపట్టాలని కోరింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తొలుత మార్గదర్శకాలను జారీచేసింది. అయితే దానివల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని పేర్కొంటూ.. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకా రం కృష్ణాజలాల పునఃపంపిణీ చేపట్టాలని రా ష్ట్రం డిమాండ్ చేస్తూ వచ్చింది. సుదీర్ఘ ప్రయత్నాల నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రంసైతం దిగివచ్చి ఆ మేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిరుడు అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలను జారీచేసింది. సెక్షన్-3 ప్రకారం ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీ చేపట్టాలని నిర్దేశించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ఇప్పటికే అటు ట్రిబ్యునల్ లో, ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. సెక్షన్-3 ప్రకారమే కృష్ణాజలాల పంపిణీ చేపడతామని ఇటీవలనే ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. తాజాగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ఏపీ తన వాదనల ను వినిపిస్తూ.. సెక్షన్-3 రెఫరెన్స్‌లను రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మధ్య నీటి పంపకాలను ట్రిబ్యునల్ పూర్తిచేసిందని, అవార్డును ప్రకటించకముందే కొత్తగా రెఫరెన్స్‌లను జారీ చేయడం సరికాదని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి13వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.