మొదట బనకచర్లతో వచ్చారు. తర్వాత నల్లమలసాగర్‌ను తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత గోదావరి-కావేరి పాట పాడారు. ఇప్పుడు మూడు రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడిగారు. తెలంగాణ జలహక్కుల్ని కబళించడమే లక్ష్యంగా ఒక్కోసారి ఒక్కోరూపంలో కుట్రల కత్తులు విసురుతున్నారు. ఆ వరుసలో తాజా ప్రయత్నం.. కేంద్రం మధ్యవర్తిత్వం! గత రెండున్నరేండ్లలో తెలంగాణ జలహక్కులపై ఇది నాలుగోసారి నయవంచన! ఇటు బాబు, అటు కేంద్రం ఆడిస్తున్న పరీవాహక రాష్ర్టాల పాచికల ఆటలో.. పావుగా మిగులుతున్నది రేవంత్ సర్కార్!
నదీ జలాల వివాదాలను కేంద్రం తేల్చలేదు. పెదరాయుడి తరహా తీర్పులు ఎన్ని ఇచ్చినా వాటిని ఎలాంటి వ్యాలిడిటీ లేదు. అవి ఉత్త నీటిమీది రాతలు! నదీజలాల వాటాలను, ప్రాజెక్టుల వారీ కేటాయింపులను ట్రిబ్యునళ్లు, అపెక్స్ కౌన్సిల్ తేలుస్తాయి. పరీవాహక రాష్ర్టాల మధ్య వివాదాలను అవి పరిష్కరిస్తాయి. అవి జల వివాదాలపై శాశ్వత తీర్పులుగా ఉండిపోతాయి. కానీ, ట్రిబ్యునళ్లను గాలికొదిలి ముగ్గురం కలిసి మాట్లాడుకుందామని చంద్రబాబు చర్చలకు పిలుస్తుంటే.. కేంద్రాన్ని ముందు పెట్టి ఆడిస్తుంటే.. రేవంత్ సర్కార్ ఉత్సాహంగా ఉరుకులాడుతున్నది.
ఒక నది బేసిన్‌లోని రాష్ట్రాల నీటి వాటాల మధ్య ఒప్పందం జరుగాలి కానీ.. రెండు నదులపై మూడు రాష్ట్రాల మధ్య చర్చలేంది? తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమం పేరిట ఏపీ-కర్ణాటక-తెలంగాణ చర్చలు.. ఏకాభిప్రాయంతో ముగిశాయి.. అందరి జుట్టు కేంద్రం చేతిలో పెట్టాలని! కానీ అందరూ మరచిపోతున్న విషయం కేంద్రం-బాబు ఒకే జట్టని!
సీఆర్ పాటిల్ : మూడు రాష్ర్టాల జల వివాదాలను కేంద్రమే పరిష్కరిస్తుంది
డీకే శివకుమార్ : కేంద్రం చొరవ అభినందనీయం. ఇక ముందూ ఇది కొనసాగాలి
చంద్రబాబు : గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్రం నాయకత్వంలో ముందుకు సాగుదాం
రేవంత్‌రెడ్డి : కేంద్రమే శాశ్వత పరిష్కారం చూపుతుందన్న నమ్మకం నాకున్నది
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: ట్రిబ్యునల్స్ అవార్డుల్లేవు.. నిబంధనల్లేవు.. పరిమితుల పట్టింపుల్లేవు.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు లేవు.. దొడ్డిదారిన ఒప్పందాల ముసుగులో బాబు నయవంచక ప్రతిపాదనలపై ఒప్పందాలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు పచ్చజెండా ఊపుతున్నది. కర్ణాటక వేదికగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ మధ్యవర్తిత్వం వహించగా.. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే దీనిపై కీలక ప్రకటనలు వెలువడుతాయని కేంద్ర మంత్రి, రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం ప్రకటించారు. తుంగభద్రా డ్యామ్‌కు ఇటీవల కొత్తగా అమర్చిన 33గేట్లను ప్రారంభోత్సవాన్ని కర్ణాటక రాష్ట్రం మునీరాబాద్‌లోని తుంగభద్ర జలాశయం వద్ద గురువారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేంద్ర మంత్రి, రాష్ర్టాల ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. కీలక ఒప్పందాలు జరిగాయని. త్వరలోనే వాటిపై విధానపర నిర్ణయాలు వెలువడుతాయని ప్రకటించారు.
కేంద్ర మంత్రి, మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలతో ఒప్పందాల విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. వాస్తవంగా నదీ జలాల్లో వాటా, రాష్ర్టాల హక్కులను ట్రిబ్యునళ్లు నిర్ధారిస్తాయి. అందులో ఏ నదికి ఆ నదికే ఇవి ఉంటాయి. ప్రస్తుతం రెండు వేర్వేరు నదుల బేసిన్లపై తొలిసారి దొడ్డిదారిన ఒప్పందాలకు తెరతీశారు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర జలవివాదాలను ఏపీ, తెలంగాణలు కేంద్ర మంత్రి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అపెక్స్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అవేవీ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలకు సిద్ధమవడం చర్చకు దారితీసింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఫార్ములాలకు తాజాగా ఒప్పందాల ముసుగు వేస్తున్నారని తెలిసిపోతున్నది. సభలో వెల్లడించిన విషయాలు అదే విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. ఉమ్మడిగా ఉన్నంత కాలం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కుట్రలు పన్ని కృష్ణాజలాల్ని సీమాంధ్రకు దోచిపెట్టిన చంద్రబాబు.. మరోసారి తెలంగాణ హక్కు జలాలపై పంజా విసిరేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం పంచన చేరి తెలంగాణ రైతులకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు? తొలుత సముద్రంలో కలిసే 200 టీఎంసీల వరద జలాలనే తరలిస్తామంటూ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును రూ.81వేల కోట్లతో ప్రతిపాదించారు.
ఈ ప్రమాదాన్ని బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’ మొదట్లోనే గుర్తించి.. తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు కేంద్ర సంస్థలు ప్రాజెక్ట్ ఫీజుబులిటీపై పెట్టిన మెలికలతో తప్పని పరిస్థితుల్లో ఏపీ వెనుకడుగు వేసేలా చేసింది. బాబు చర్చలకు సిద్ధమని ప్రకటించడం, సీఎం రేవంత్‌రెడ్డి సైతం సై అనడం, తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు ఆ పాచిక పారక చంద్రబాబు వెనక్కి తగ్గారు.
బనకచర్ల పాచిక పారకపోవడంతో చంద్రబాబు తన రూపం మార్చుకున్నారు. కేంద్రాన్ని సైతం ముందుకు తోశారు. రెండో కుట్రలో భాగంగా రూ.59వేల కోట్లతో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు అంటూ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు తరహాలోనే పోలవరం నుంచి గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడినుంచి రెండు దశల్లో ఎత్తిపోతల ద్వారా నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఏ రాయితో కొట్టుకుంటే ఏమిటన్నట్టు అటు బనకచర్ల అయినా… ఇటు నల్లమలసాగర్ అయినా.. రెండూ 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలన్నదే చంద్రబాబు స్కెచ్.
అంతేకాదు తన మద్దతుపై ఆధారపడి మనుగడ సాధిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. అనుకూలంగా రేవంత్‌రెడ్డి సర్కార్‌తోనూ చర్చలు కొనసాగించి, సమస్యల పరిష్కారం కోసమంటూ కేంద్రంతో ప్రత్యేకంగా నిపుణులను కమిటీని వేయించింది. గుట్టుగా రేవంత్ సర్కార్ నుంచి అనుమతులు తీసుకొనేందుకు యత్నించింది. అయితే ఈ కుట్రను సైతం బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ బట్టబయలు చేసింది. బీఆర్ఎస్ మరోసారి గళం విప్పింది. తెలంగాణ సమాజాన్ని కదిలించింది.
బనకచర్ల.. నల్లమలసాగర్ రూపంలో వచ్చి తెలంగాణలో ఎగిసిపడుతున్న వ్యతిరేకతను చూసిన చంద్రబాబు ఇక లాభం లేదనుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ గోదావరి జలాల్ని గురిపెట్టారు. చంద్రబాబు రచించిన నల్లమలసాగర్ అలియాస్ బనకచర్ల ప్రయోజనాలను కేంద్ర నిధులతోనే పూర్తిచేసి, తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోవాలని ప్రణాళికలు సిద్ధంచేశారు. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహంలో భాగంగా తెలంగాణ నుంచి గోదావరి జలాలను ఎలా తన్నుకుపోవాలనే కుట్ర పారాలంటే బ్లాక్‌మెయిలింగ్ ద్వారానే సాధ్యమవుతుందని కేంద్రం నిర్ణయించినట్టు సాగునీటి రంగ నిపుణులు స్పష్టమైన ఆరోపణ చేస్తున్నారు. అందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పావుగా వాడుకుంటున్నట్టు చెబుతున్నారు.
కేంద్రమే మధ్యవర్తిత్వం వహించి మరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులిస్తే నల్లమలసాగర్‌కు అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామంటూ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్ ద్వారా కర్ణాటకకు 16 టీఎంసీలు వినియోగించుకొనేలా, అందుకోసం ఎగువన బెడ్తి-వర్ద లింక్‌ను చేపట్టేందుకు, నావలి విస్తరణకు నిధుల సాయానికి అంగీకారం తెలిపింది. తాజాగా ఆయా అంశాలపైనే ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తున్నది. తాజాగా ఏపీ సీఎం బాబు రూపొందించిన ఈ ఫార్ములాలకే ఒప్పందాల ముసుగు వేస్తున్నారని తెలిసిపోతున్నది.
నీటి పంపిణీ విషయంలో గతంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య భేదాభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక రావడం అభినందనీయమని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర సహా చాలా జలాశయాల్లో 15శాతం కంటే ఎకువ పూడికతో నిండిపోవడంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జలాశయాలలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు కేంద్రం త్వరలో ఒక ప్రాజెక్టును ప్రారంభించనున్నదని వెల్లడించారు. పూడికతీతకు కేంద్రం సాంకేతిక సహాయం అందిస్తుందని, అమలు బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని సూచించారు. ఆ మూడు రాష్ట్రాలు పంచుకున్న సహకారం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే తుంగభద్ర జలాశయంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయగలిగామని, ఆ స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని కోరారు.
తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నావలి రిజర్వాయర్ విస్తరణపై కేంద్రానికి ప్రతిపాదనలు, తుంగభద్రా డ్యామ్‌లో పూడిక తొలగింపుపై కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూలంకషంగా చర్చించామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఆయా ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో తమ ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన చేస్తారని డీకే ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహచరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, వెంటనే అమలుచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ నీటి సమస్యకు శాశ్వత పరిషారానికి నదుల అనుసంధానం అత్యవసరమని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో తుంగభద్ర, అల్మట్టి జలాశయాలకు ఆశించినంత నీరు చేరలేదని, ఇలాంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానమే ఏకైక మార్గమని, నీటి లభ్యత ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉన్న నదులకు నీటిని మళ్లించడం ద్వారా కరువును సమర్థవంతంగా ఎదురోవచ్చని తెలిపారు. నదుల అనుసంధానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హకులను పరిరక్షిస్తూ, తమిళనాడుకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మోదీ నాయకత్వంలో నదుల అనుసంధానమూ విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
రైతుల కోసమే మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులం కలిసికట్టుగా అడుగులు ముందుకు వేశామని, చర్చలు కొలిక్కి వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజకీయాలకతీతంగా జరిగిన చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతాయని, ఈ నిర్ణయం అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిషారం చూపుతుందని అభిప్రాయపడ్డారు. రాజోలిబండ డైవర్షన్ సీమ్‌లో నీటి వినియోగంలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, చంద్రబాబు, తాను బళ్లారి వేదికగా చర్చలు కొనసాగించామని, అవి ఒక కొలికి వచ్చాయని వెల్లడించారు. సమస్యకు కేంద్ర మంత్రి శాశ్వత పరిషారం చూపిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నామని తెలిపారు.