Tungabhadra | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ నదీజలాల్లో అన్యాయం జరగకుండా చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పొరుగు రాష్ర్టాలు కాలరాస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. తుంగభద్ర జలాల మళ్లింపు కోసం ఏపీ, కర్ణాటక కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ ఖండించలేదంటే ఆయన ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందంటూ కర్ణాటక సర్కారు నావలి రిజర్వాయర్ విస్తరణకు ప్రణాళికలు రచించింది. వరదజలాలే తరలిస్తామని చెబుతూ ఏపీ సర్కారు హెచ్ఎల్సీ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వాలని చూస్తోంది. రెండు రాష్ర్టాల ప్రణాళికలు కార్యరూపం దాల్చితే శ్రీశైలం ప్రాజెక్టుకు రాకముందే నీళ్లు ఎగువ నుంచే మరలిపోతాయి. తుంగభద్ర డ్యామ్‌లో పూడికపెరిగి నీటిని వినియోగించుకోలేని పరిస్థితులున్నాయనే సాకుతో ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు కర్ణాటక సిద్ధమైంది. 31 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలను విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ అనంతపురం జిల్లా మీదుగా పోతున్నది. హెచ్ఎల్సీ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు ప్రణాళికలను రూపొందించింది.
ఏటా 500 టీఎంసీల జలాలు కృష్ణాలోకి వస్తాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తే కృష్ణాలోకి వచ్చే జలాలు తగ్గిపోతాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు జలాలు రావడమే గగనమైపోతుందని, మనకు నష్టం కలుగుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
కర్ణాటక ప్రతిపాదిస్తున్న కాలువలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. తుంగభద్ర బోర్డు మీటింగ్‌లోనూ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నోరు మెదపడంలేదు. నేడు హోస్పేట్లో తుంగభద్ర బోర్డు 220వ సమావేశం జరగనుంది. ఇవాళ్టి సమావేశంలోనైనా రేవంత్ సర్కారు కర్ణాటక, ఏపీ ప్రాజెక్టులపై వ్యతిరేకత తెలపాలని తెలంగాణ ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు.