హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న యూరియా, ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పరిష్కారించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ ఆయిల్‌పామ్ లక్ష్యాన్ని తెలంగాణ సమర్థవంతంగా అమలుచేస్తున్నదని మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించగా, 70 వేల మందికిపైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నట్టు తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులకు కనీస గ్యారెంటీ ధర విధానాన్ని అమలుచేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కోరారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సేకరణ లక్ష్యాన్ని పెంచాలని, అదే విధంగా కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువు పొడిగించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 80.09 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, కేంద్రం 51.47 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతిచ్చినట్టు తెలిపారు.