న్యూఢిల్లీ: ఈ-20 పెట్రోల్‌పై నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి వంద మందితో మార్చ్ నిర్వహించి పిటిషన్లు అందజేస్తానని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఈ-20 పెట్రోల్ అమ్మడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మైలేజీ తగ్గిపోవడం, ఇంజిన్‌లో రిపేర్లు వస్తున్నాయి. 2023 కంటే ముందు వాహనాల ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ-20ని కేంద్రం కొనసాగించడం వెనక రహస్య ఎజెండా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వల్లే యూఎస్ నుంచి భారత్ ఇథనాల్ కొంటున్నది. నేను లేఖ రాసినా మోదీ స్పందించలేదు. అందుకే ఆయన ఇంటికెళ్లి ఫిర్యాదు చేస్తా. అన్ని పెట్రోల్ బంకుల్లో ప్యూర్ పెట్రోల్ తో పాటు ఈ-5, ఈ-10 పెట్రోల్ కూడా అమ్మాలన్నదే మా డిమాండ్’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఈ-20 పెట్రోల్ ధరలు తక్కువగా ఉండాల్సింది పోయి ఇతర దేశాలలో దొరుకుతున్న ప్యూర్ పెట్రోల్ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.తాను మోదీకి ఇవ్వబోయే పిటిషన్లపై 2లక్షల మందికి పైగా వాహనదారులు సంతకం చేశారని.. దీన్ని బట్టి ఇథనాల్ పెట్రోల్ మీద ఉన్న వ్యతిరేకతను గ్రహించాలని కేజ్రీవాల్ కోరారు.