హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్ఫూర్తిగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రజాస్వామిక హకుల సాధన కోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయమని పేర్కొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం వారి త్యాగనిరతిని స్మరించుకుంటూ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి ఉన్నదని సూచించారు. పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తి చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్య సంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీ ఆశయాలను ప్రతి ఒకరూ అనుసరించాలని కోరారు.
తెలంగాణ సాధన కోసం తాను ఒంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థితప్రజ్ఞతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని స్పష్టంచేశారు. విద్వేష పూరిత ప్రసంగాలు, కక్షపూరిత వైఖరులను వీడి, ప్రజల నడుమ శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారానే జాతిపిత మహాత్మాగాంధీకి మనం నిజమైన నివాళులర్పించిన వారమవుతామని పునరుద్ఘాటించారు. గాంధీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.