హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు కేంద్ర రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. 2026 వానకాలానికి సంబంధించిన యూరియా కేటాయింపులను 10 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 11.50 లక్షల మెట్రి క్ టన్నులకు పెంచాలని తుమ్మల కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి దీన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల వారీగా గ్రామాలకు కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సుముఖంగా ఉన్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ మీటింగ్ హాల్లో మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో రెండోరోజు మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వారం రోజుల్లో మహిళా సమాఖ్య సంఘాల నుంచి 350 కొత్త బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీసీని విస్తరించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.