హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి బాటలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నడుస్తున్నారని బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ, జడ్పీ మాజీ అధ్యక్షురాలు విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కవిత ఎందుకు ప్రశ్నించకుండా, బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్లి నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆమె మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకురాలు సుశీలారెడ్డి, రాజ్యలక్ష్మితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడుపోసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల కోసం కొట్లాడుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై తాము కొట్లాడితే, తెల్లారే కవిత ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు ఓ ఉద్యమనాయకుడిగా గుండెలో పెట్టుకొని చూసుకుంటుంటే.. కవిత మాత్రం ఓ దో షిగా నిలబెట్టాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కవిత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్పై బురద చల్లడం సరైనది కాదని సుశీలారెడ్డి, రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చి అమలు చేయని హామీలపై పోరాడితే గౌరవం దక్కుతుందని హితవు పలికారు.