TTD | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): ఈ నెల 10న జరుపుకునే వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 91 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తామని పేర్కొన్నారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజులపాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
చంటిపిల్లల తల్లిదండ్రులతోపాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజులపాటు టీటీడీ రద్దు చేసింది. అన్నమయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల సందేహాలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. వైకుంఠ ద్వారదర్శనం సందర్భంగా భక్తులకు 10 రోజులపాటు వసతి కల్పించేలా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తుల కోరిక మేరకు ఈవో సానుకూలంగా స్పందించారు.
రైల్వే రిజర్వేషన్‌ను 60 రోజులకు తగ్గించిన నేపథ్యంలో ఆర్జిత సేవల బుకింగ్‌ను సైతం రెండు నెలలకు తగ్గించాలన్న ఓ భక్తురాలి వినతిని పరిశీలిస్తామని చెప్పారు. తిరుమలలో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించాలని పలువురు భక్తులు కోరారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది లగేజీని సరిగా పరిశీలించడం లేదని ఫిర్యాదులు అందాయి. తిరుపతిలోని కోదండరామాలయంలో జనవరి నెలలో 4,11.18, 25న పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.