హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేశామని, త్వరలో తేదీని వెల్లడిస్తామని చెప్పారు. ఈ యాప్లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. జనవరిలో 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీకి రూ.123. 07 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.