హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇకడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో బుధవారం కేటీఆర్‌ను నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని కేటీఆర్‌కు అందజేశారు.
అనంతరం బీఆర్ నాయుడిని కేటీఆర్ శాలువాతో సతరించి శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు నాయుడుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో ఒకచోట, సిరిసిల్లలో రెండు చోట్ల గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు. కేటీఆర్ విజ్ఞప్తులపై బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని నాయుడు హామీ ఇచ్చారు.