హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని స్కేడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసినట్టు ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) జే శ్రీనివాసరెడ్డితో కలిసి విద్యుత్తుశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్తు సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 15 మంది స్కిల్డ్ సిబ్బందితో డివిజన్ స్థాయిలో డిజాస్టర్ బృందాలను సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. డిజాస్టర్ టీమ్‌లు విద్యుత్తు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తాయని, కంట్రోల్‌రూమ్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పనిచేస్తాయని తెలిపారు. అత్యసవర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100, స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తోపాటు విద్యుత్తుశాఖ కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యుత్తుశాఖ మొబైల్యాప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.