TSREDCO Satish Reddy | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): వారసత్వ రాజకీయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మోదీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు బీజేపీ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి కిందిస్థాయి వరకు ప్రతీచోటా బీజేపీలో వారసత్వమే ప్రస్తుతం రాజ్యమేలుతోందని, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతల కుటుంబాలే నడిపిస్తున్నాయని, పదవులన్నీ వాళ్ల కుటుంబసభ్యులకే ఇచ్చుకుంటున్నారనేది జగమెరిగిన సత్యమని అన్నారు. అమిత్ షా కొడుకు జైషాకు బీసీసీఐలో ఏ అర్హతతో పదవి ఇచ్చారో ప్రధాని మోదీ చెప్పాలని సతీష్ రెడ్డి నిలదీశారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన సోదరుడు అరుణ్ సింగ్ దుమాల్, ప్రస్తుత కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. కేంద్రమంత్రులు మొదలు సీఎంలు, ఎమ్మెల్యేల దాకా అంతా తండ్రులు, కొడుకుల రాజకీయం నడుస్తోందని సతీశ్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి బీజేపీలో ఉన్న నరేంద్రమోదీ.. ఎమ్మెల్సీ కవిత పై విమర్శలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ద్వజమెత్తారు. తెలంగాణలో ఎలాగూ బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని ఎప్పుడో మోదీకి అర్థమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ దూకుడు కనిపిస్తోందని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయం పట్టుకుందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమనే టెన్షన్ పట్టుకుందని సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఫ్రస్టేషన్ లోనే నరేంద్రమోదీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా అయిన బీజేపీలోనే తాను ఉన్నాననే విషయం మోదీ మరిచిపోయినట్టున్నారని ఏద్దేవా చేశారు. తప్పును ఇతరులపై రుద్ది ప్రజల దృష్టి మరల్చాలనే దుర్మార్గ ప్రయత్నంలో భాగంగానే మోదీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
గౌరవించుకోవాల్సిన మహిళలపై విమర్శలు ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే నీచ బుద్దికి ప్రజలే సమాధానం చెబుతారని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, ప్రధాని అయినప్పటి నుంచి అతని బాగుకోసమే మోదీ పనిచేస్తున్నాడని ప్రపంచమే కోడై కూస్తోందన్నారు. అందుకే అదానీ బాగుండాలంటే మోదీకి ఓటేయాలని, రైతుల భవిష్యత్ బాగుండాలి.. దేశం, ప్రజలు బాగుండాలి అంటే బీఆర్ఎస్కి ఓటేయాలని సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు.